Skip to content

Aditya Hrudayam in Telugu – ఆదిత్య హృదయం

Aditya Hrudayam Stotram Lyrics or Aditya Hridaya StotraPin

Aditya Hrudayam is a powerful hymn dedicated to Lord Surya Deva (the Sun God), found in the Yuddha Kanda of the Ramayana. It is taught to Lord Rama by sage Agastya just before his battle with Ravana, to restore his strength, confidence, and clarity. The hymn praises Surya as the source of life, energy, and cosmic order, invoking his power to dispel darkness, fear, and ignorance. Comprising 31 verses, it is considered a spiritual tool for inner strength, health, and success in difficult times. Reciting the Aditya Hrudayam, especially in the morning, is believed to bring mental peace, vitality, and divine protection. Get Aditya Hrudayam in Telugu Lyrics Pdf here and chant with utmost devotion to get rid of health issues, depression, or defeatist thoughts.

ఆదిత్య హృదయం స్తోత్రం సూర్యభగవానుడి శక్తివంతమైన శ్లోకం. యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి రాముడికి తన బలం, విశ్వాసం మరియు స్పష్టతను పునరుద్ధరించడానికి దీనిని బోధించాడు. ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండము నందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి. ఈ శ్లోకం సూర్యుడిని జీవితం, శక్తి మరియు విశ్వ క్రమానికి మూలంగా ప్రశంసిస్తుంది. 31 శ్లోకాలతో కూడిన ఇది అంతర్గత బలం, ఆరోగ్యం మరియు కష్ట సమయాల్లో విజయం కోసం ఒక ఆధ్యాత్మిక సాధనంగా పరిగణించబడుతుంది. ఆదిత్య హృదయాన్ని, ముఖ్యంగా ఉదయం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, తేజస్సు మరియు దైవిక రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఆరోగ్య సమస్యలు, నిరాశ లేదా ఓటమి ఆలోచనలను వదిలించుకోవడానికి ఆదిత్య హృదయాన్నిఅత్యంత భక్తితో జపించండి.

Aditya Hrudayam in Telugu – ఆదిత్య హృదయం 

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||

అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||

అర్థము : యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||

అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||

అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.

సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||

అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||

అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||

అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||

అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||

అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||

అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||

అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||

అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||

అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||

అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||

అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||

అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||

అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||

అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||

అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||

అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||

అర్థము : బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||

అర్థము : రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||

అర్థము : ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||

అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||

అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||

అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.

అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||

అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||

అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||

అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.

ఇతి శ్రీ ఆదిత్య హృదయం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి