Yama Dwitiya Katha is the story of Lord Yama and his sister Goddess Yamuna Devi and the significance of Yama dwitiya day or Yama Vidiya. See Yama Dwitiya Story in Telugu below.
Yama Dwitiya Katha in Telugu – యమ ద్వితీయ కథ
ఋషి వాలఖిల్యుడు చెప్పారు:
కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ తిథిని “యమ ద్వితీయ” అని పిలుస్తారు. ఈ పవిత్ర దినాన సాయంత్ర సమయంలో యమధర్మరాజును పూజించాలి.
ప్రాచీన కాలంలో ఒకప్పుడు యమునాదేవి, యమధర్మరాజుకు ప్రతిదినమూ ప్రార్థిస్తూ — “ఓ అన్నయ్యా! మీరు మీ స్నేహితులతో సహా నా ఇంటికి వచ్చి భోజనం చేయండి” అని కోరుతూ ఉండేది. అప్పుడు యముడు “రేపు వస్తాను, లేదా ఎల్లుండి వస్తాను, సమయం దొరకడం లేదు” అని చెప్పేవాడు.
ఆ రోజు, యమునా దేవి యముడిని చాలా గట్టిగా ఆహ్వానించింది, అప్పుడు యమధర్మరాజు కార్తీక శుక్ల ద్వితీయ రోజున యమునాదేవి ఇంటికి భోజనార్థం వచ్చారు. ఆయన వచ్చేముందు తన పాశంతో బంధింపబడిన సకల ప్రాణులనూ విముక్తులను చేశారు.
యమునాదేవి ఆనందంగా తన అన్నయ్యను ఆహ్వానించి సుగంధ తైలాలతో అభ్యంగనం చేసి స్నానము చేయించారు. అనంతరం మంగళవస్త్రాలు, ఆభరణాలు, చందనమాలలు ధరింపజేశారు. బంగారు తాళాలలో విభిన్న రకాల వంటకాలతో భోజనం సమర్పించారు. భోజనం అనంతరం యముడు కూడా తన చెల్లెలిని వస్ర్తాలభరణాలతో సత్కరించాడు.
తరువాత యముడు యమునాదేవితో ఇలా అన్నాడు – “ఓ సోదరి! నీకు ఏ వరం కావాలో అడుగు.”
అప్పుడు యమునాదేవి చెప్పింది – “అన్నయ్యా! ప్రతి సంవత్సరం ఈ రోజున నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఈ రోజున తమ చెల్లెలి చేత భోజనం చేసే వారికి నీవు ఎప్పుడూ పాశబంధనాల నుండి విముక్తి కలిగించాలి, వారికి ఆయుష్షు, ఐశ్వర్యం, సుఖం కలగాలి.”
అప్పుడు యముడు అన్నాడు – “ఓ సూర్యపుత్రిక! ఈ రోజున నీ జలాల్లో స్నానం చేసి, పితృదేవతల తర్పణం చేసినవారు, ఆ తరువాత చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేత భోజనం చేసినవారు నా లోక ద్వారాన్నికూడా చూడరు.
కైలాస పర్వతం ఈశాన్యదిక్కులో యమతీర్థం అనే పవిత్ర స్నానస్థలం ఉంది. అక్కడ స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేసి, మధ్యాహ్న సమయంలో సూర్యుని ఎదుట కూర్చొని ఈ యమునామాలను జపించాలి — యమ, నిహంతా, పితృరాజ, ధర్మరాజ, వైవస్వత, దండధర, కాల, భూతాధిప, దత్తకృతానుసారి, కృతాంత. తరువాత చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె ఇచ్చిన భోజనం చేయాలి. చెల్లెలు ప్రేమతో “ఓ అన్నయ్యా! నేను నీ చెల్లెలిని. యమధర్మరాజు, యమునాదేవి ప్రసన్నతకై ఈ పవిత్ర భోజనం స్వీకరించండి” అని చెప్పాలి.అన్నయ్య కూడా చెల్లెలికి వస్త్రాభరణాలు ఇవ్వాలి. ఈ విధంగా ఆచరించినవారు యమలోకాన్ని స్వప్నంలో కూడా చూడరు.
ఈ రోజున రాజులు కూడా తమ కారాగారంలో ఉన్న వారిని విడుదల చేసి, వారి చెల్లెలి ఇంటికి భోజనానికి పంపాలి. యముడు అన్నాడు – “ఈ రోజున నేను పాపులను నరకం నుండి విముక్తులను చేస్తాను. కానీ ఈ రోజున ఎవరైనా బందీలు చేయిస్తే వారు తప్పక నా శిక్షకు పాత్రులు అవుతారు.”
చిన్న చెల్లెలు లేకపోతే పెద్ద చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేయాలి. ఆమె లేకపోతే తల్లి చెల్లెలి ఇంటికి, అది కూడా సాధ్యం కాకపోతే తండ్రి సహోదరుల ఇంటికి వెళ్లాలి. ఎవరూ లేకపోతే మావయ్య కూతురు, లేదా గోత్రసంబంధ చెల్లెలి ఇంటికి వెళ్లాలి. ఇవ్వీ లేకపోతే సోదరిగా భావించిన వారి ఇంటికి వెళ్లి భోజనం చేయాలి. అది కూడా సాధ్యం కాకపోతే గోవును లేదా నదిని చెల్లెలుగా భావించి వారి సమీపంలో భోజనం చేయాలి.
యమ ద్వితీయ రోజున ఎవరు తన ఇంట్లో భోజనం చేయరాదు. ఆ విధంగా చేసే వారు నరకంలో పడతారు. ఈ రోజున ప్రేమతో చెల్లెలి చేత భోజనం చేయాలి మరియు ఆమెకు దానం చేయాలి.
శ్రావణ ద్వితీయనాడు తండ్రి సహోదరుని కుమార్తె చేత, భాద్రపద ద్వితీయనాడు మామయ్య కూతురు చేత, ఆశ్వయుజ ద్వితీయనాడు పిన్ని లేదా బువ్వ కూతురు చేత భోజనం చేయాలి. కార్తీక శుక్ల ద్వితీయనాడు మాత్రం తప్పనిసరిగా తన చెల్లెలి చేత భోజనం చేయాలి.
ఇలా యమ ద్వితీయ మహిమను వివరించిన అనంతరం యమధర్మరాజు తన సయమనీ నగరానికి తిరిగి వెళ్ళాడు.
ఋషి వాలఖిల్యుడు తిరిగి మునులకు చెప్పాడు –
“ఓ కార్తీక వ్రతధారులారా! యమ ద్వితీయ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేత భోజనం చేయండి. ఇది నిజమైన సత్యం. సూర్యభగవానుడే అన్నాడు – ‘యమ ద్వితీయ రోజున చెల్లెలి చేత భోజనం చేయని మనుష్యునికి సంవత్సరాంతం చేసిన సకల సత్కార్యాలు నశిస్తాయి. ఆ రోజున చెల్లెలు తన అన్నయ్యకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చినట్లయితే, ఆమె ఎప్పుడూ విధవరాలు కాదూ, ఆమె అన్నయ్యకు ఆయుష్షు తగ్గదు.’
ద్వితీయ తిథి మధ్యాహ్నం వరకు ఉన్నప్పుడు భోజనం చేయాలి. ఎవరైనా అజ్ఞానవశం, దేశాంతర నివాసం లేదా బంధన కారణంగా చెల్లెలి చేత భోజనం చేయలేకపోతే, యమ ద్వితీయ కథ వినడం ద్వారా కూడా అదే ఫలితాన్ని పొందుతారు.”
ఇతి శ్రీ యమ ద్వితీయ కథ సంపూర్ణం ॥

